రాజ్యాంగబద్ధ సంస్థలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల సంఘంపై ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొంటూ బీజేపీ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని, దీంతో ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవాలపై ప్రశ్నలు తలెత్తాయని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది. రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో అనుమానాలు కలిగించేలా ఆరోపణలు చేయడం సరికాదని తెలిపింది.
గతంలో కూడా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియ, ఈవీఎంలు, SIR ప్రక్రియ, ఫార్మ్‌-6 తదితర అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారని బీజేపీ గుర్తుచేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు వచ్చిన సందర్భాల్లో, అదే ఎన్నికల వ్యవస్థపై కాంగ్రెస్ వైఖరి భిన్నంగా ఉంటుందని విమర్శించింది.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదించిన అంశాన్ని కూడా బీజేపీ తన ప్రకటనలో ప్రస్తావించింది. ఆ వ్యవహారంలో రాహుల్ గాంధీ తరువాత సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన విషయాన్ని గుర్తుచేసింది.
అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసును కూడా బీజేపీ ప్రస్తావించింది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తులు వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరాన్ని ఆ సందర్భంగా సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని పేర్కొంది.
విదేశీ పర్యటనల్లో భారతదేశం, సైన్యం తదితర అంశాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపైనా బీజేపీ విమర్శలు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల్లో అనుమానాలు కలిగించవద్దని సూచించింది.
ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని బీజేపీ పేర్కొంది. రాజకీయంగా ఎదురయ్యే సమస్యలకు రాజ్యాంగ సంస్థలను బాధ్యులను చేయడం కాకుండా, ప్రజల ముందు ఆధారాలతో మాట్లాడాలని సూచించింది.
ఎన్నికల్లో ఎదురయ్యే రాజకీయ పరాజయాలకు ఎన్నికల వ్యవస్థను లేదా రాజ్యాంగ సంస్థలను బాధ్యులను చేయడం సరైన విధానం కాదని బీజేపీ తన ప్రకటనలో పేర్కొంది