న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, సవరణలకు సంబంధించిన ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తుల సమర్పణకు ఎలక్షన్ కమిషన్ నిర్దిష్ట గడువులు విధించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యంగా జీవనోపాధి కోసం తరచూ ప్రాంతాలు మారే వలస కార్మికుల హక్కులను కాపాడేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిరంతరం కొనసాగాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. కేవలం నిర్దేశిత ఫామ్ నింపలేదన్న కారణంతో ఓట్లను తొలగించే అధికారం లేదని, అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని గుర్తుచేసింది. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారు తిరిగి ఫామ్-6 ఎందుకు నింపాల్సి వస్తోందని ప్రశ్నిస్తూ, చిరునామా మార్పులకు ఫామ్-8 ద్వారానే పరిష్కారం చూపే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.