భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు

అభ్యుదయం-కూకట్‌పల్లి: మూసాపేట్ డివిజన్‌లో నవ యువక అసోసియేషన్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ గణేశ విగ్రహానికి బుధవారం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్‌, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌ బండి రమేష్ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, వేడుకలు ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరగడం ఆనందంగా ఉందన్నారు. గణనాథుడి ఆశీస్సులతో నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజల్లో ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నవ యువక అసోసియేషన్స్ సభ్యులను అభినందించారు.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, వినాయకుడి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పండుగ వేడుకలు సామాజిక ఐక్యతను చాటేలా నిర్వహించడం అభినందనీయమని, పూజా కార్యక్రమాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను, యువతలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బ్లాక్, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నవ యువక అసోసియేషన్స్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.