హైదరాబాద్ (అభ్యుదయం న్యూస్):
ఈ నెల 13, 14 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘భారత్ సమ్మిట్’ ఏ ప్రాతిపదికన జరుగుతోందో తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాలని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిధులతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఒక ‘లక్ష్మణ రేఖ’ ఉంటుందని, దానిని ప్రభుత్వం గౌరవించాలని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీ విజన్‌ను ప్రపంచ దేశాల ముందు ఉంచేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడంపై కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దేశంపై విషం చిమ్మే శక్తులు, జార్జ్ సోరోస్ వంటి వారి ఎజెండాతో పనిచేసే శక్తులన్నీ హైదరాబాద్ వేదికగా ఏకమవుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడుతుంటే, ఓవైపు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అంటూనే మరోవైపు ఈ సదస్సు ద్వారా దేశంలోకి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. సొంత ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను చించివేయడం, దంతేవాడ ఘటనపై వ్యాఖ్యలు, రాజ్యాంగబద్ధ సంస్థలను తక్కువ చేసి చూపడం వంటివే రాహుల్ గాంధీ విజనా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ ఆర్థిక పరిస్థితి అత్యయిక స్థితి వైపు వెళ్తోందని, పెండింగ్ బిల్లుల చెల్లింపునకు హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీలు "ఎక్కడ వేసిన గొంగడి అక్కడే" అన్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2,500 చొప్పున ఒక్కొక్కరికి రూ. 85 వేలు, సామాజిక పింఛన్ల పెంపు కింద రూ. 1.02 లక్షలు, నిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 1.36 లక్షల చొప్పున ప్రభుత్వం బకాయి పడిందని ఆయన లెక్కలతో సహా ఆరోపించారు.
అలాగే వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, కౌలు రైతులకు సాయం, విద్యా భరోసా కార్డు, ఎస్సీ-ఎస్టీలకు రూ. 12 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ. 25 లక్షలు, ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏవీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని కిషన్ రెడ్డి అన్నారు. రేపు, ఎల్లుండి జరిగే సమ్మిట్‌కు హాజరయ్యే అంతర్జాతీయ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పడిన ఈ బకాయిల వివరాలను కూడా చూపిస్తే బాగుంటుందని, దీనిపై రాహుల్ గాంధీ స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.






