వ్యాపార వర్గాలకు స్థిరత్వం కల్పించే దిశగా జీఎస్టీ మండలి కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇకపై పన్ను రేట్ల సవరణలను ఏడాదికి ఒకేసారి మాత్రమే పరిశీలించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ మార్పులు జరిగితే అవి ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయి. ఈ నెల 8వ తేదీన జరగనున్న 57వ జీఎస్టీ మండలి సమావేశంలో సాధారణ పన్ను రేట్ల మార్పులపై ఎలాంటి ప్రతిపాదనలు లేవని తెలిసింది. ఈ భేటీలో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరిగే డెలివరీలకు ఐటీసీ మినహాయింపు లేకుండా 5 శాతం సింగిల్ జీఎస్టీ రేటును వర్తింపజేసే అంశంపై చర్చించనున్నారు. అలాగే సంస్థలు తమ ఉద్యోగుల కోసం తీసుకునే ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) పొందేందుకు వెసులుబాటు కల్పించాలనే డిమాండ్‌ను పరిశీలిస్తున్నారు. అరుదైన వ్యాధుల చికిత్సకు విదేశాల నుంచి తెప్పించే ఔషధాలు, ప్రత్యేక ఆహారాలపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చే ఆలోచన కూడా ఉంది.
For more information on this article, please refer to Page Number 7, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026.






