భారత బీమా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం తెరలేపింది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఆటోమేటిక్ రూట్ ద్వారా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్​డీఐ) అనుమతిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ప్రచురించింది. అయితే ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) లో మాత్రం గరిష్ట ఎఫ్‌డీఐ పరిమితిని 20 శాతంగానే కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. అలాగే వచ్చే విదేశీ పెట్టుబడులు ఐఆర్‌డీఏఐ (IRDAI) నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది.

పార్లమెంట్ ఆమోదించిన 'సబ్కా బీమా సబ్కీ రక్షా' బిల్లులో భాగంగా బీమా చట్టంలో ఈ కీలక సవరణలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ బీమా దిగ్గజాలు భారీ మూలధనంతో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు సైతం బీమా రక్షణ విస్తరిస్తుందని, కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొనడం ద్వారా బీమా ప్రీమియం చార్జీలు తగ్గి సామాన్య ప్రజలకు నాణ్యమైన పాలసీలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.