అభ్యుదయం - యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుములను తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం చేస్తున్న సన్నాహాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు ఆందోళన బాట పట్టాయి. అఖిల భారత వినియోగ ఉత్పత్తుల పంపిణీదారుల సమాఖ్య, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్, బులియన్ ట్రేడర్స్ తదితర సంఘాలు అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ పాటించాలని పిలుపునిచ్చాయి. ఆ రోజున దుకాణాల్లో ఎలాంటి ఆన్‌లైన్ పేమెంట్లను స్వీకరించబోమని, కేవలం నగదు లావాదేవీలే జరుపుతామని సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. చిన్న వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు స్వల్ప మార్జిన్లతో వ్యాపారాలు కొనసాగిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్లపై అదనపు భారం మోపితే వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుందని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2న తమ షాపుల్లో ఉన్న క్యూఆర్ కోడ్ బోర్డులు, స్కానర్లు, పేమెంట్ సౌండ్ బాక్సులకు నల్లటి వస్త్రాలు కప్పి తమ నిరసనను వ్యక్తం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎండీఆర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
మరింత సమాచారం కోసం ‘అభ్యుదయం’ ఈ-పేపర్ పేజీ నంబర్ 1, 2 చూడండి (తేదీ: 25-09-2026).






