​అభ్యుదయం -హైదరాబాద్:
హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని హైడ్రా (HYDRAA) కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రమాదకరమైన భవనాల్లో హాస్టళ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పటిష్టమైన కట్టడాలతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులు ఉన్న భవనాల్లోనే హాస్టళ్లు నడపాలని ఆయన సూచించారు.
​ప్రస్తుతం బలహీనమైన, ప్రమాదకర భవనాల్లో హాస్టళ్లు నడుపుతున్న నిర్వాహకులు వెంటనే సురక్షితమైన భవనాల్లోకి మారాలని స్పష్టం చేస్తూ, ఇందుకు 3 నెలల గడువు విధించారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఉండి ప్రమాదకరంగా మారిన భవనాలను తొలగిస్తామని వెల్లడించారు.
​ఇటీవల గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలి ఇద్దరు మరణించడం, ఢిల్లీలో హాస్టల్ భవనం కుప్పకూలి ఏడుగురు దుర్మరణం పాలైన ఘటనల నేపథ్యంలో హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో హాస్టల్ నిర్వాహకులు, భవన యజమానులతో హైడ్రా కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. చదువు, ఉద్యోగాల కోసం వచ్చే వారి ప్రాణాలతో చెలగాటమాడవద్దని, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, భవన నిర్మాణ పటిష్టత తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు.
​మూడు కార్పొరేషన్లతో సమన్వయంగా తనిఖీలు
​జీహెచ్ఎంసీతో పాటు ఇతర కార్పొరేషన్లతో కలిసి అనుమతి లేని హాస్టల్ భవనాలపై సంయుక్త తనిఖీలు చేపడతామని రంగనాథ్ తెలిపారు. కేవలం తక్కువ ఫీజులు వసూలు చేసి, సరైన వసతులు లేకుండా ప్రాణాలకు ముప్పు తేవద్దని హెచ్చరించారు. 50 గజాల స్థలంలో 7 అంతస్తులు కట్టడం సూసైడ్ బాంబర్లతో సమానమని, దీనివల్ల పక్క భవనాలు కూడా ముప్పును ఎదుర్కొంటాయని తెలిపారు. గతంలో సిద్ధిక్ నగర్ ఘటన, అంజయ్యనగర్‌లో ప్రమాదకరంగా ఉన్న 6 భవనాలను తొలగించిన విషయాలను గుర్తుచేశారు.
​భవనాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హైడ్రా అదనపు డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య వీడియో ప్రజెంటేషన్ ద్వారా నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

#HYDRAA #Hyderabad #HostelSafety #HostelInspection #BuildingSafety #FireSafety #PublicSafety