తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) తనపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయడంపై కూకట్పల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తన వివరణను పరిశీలించిన టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ సస్పెన్షన్ను అధికారికంగా ఎత్తివేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీపీసీసీ నాయకత్వానికి, క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవికి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ అనంతులకు, డీసీసీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని పేర్కొన్న శేరి సతీష్ రెడ్డి, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. తనకు అండగా నిలిచిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం
పదవుల కంటే పార్టీ బలోపేతానికే ప్రాధాన్యత ఇస్తానని, కాంగ్రెస్ కార్యకర్తల అభిమానం తనకు ప్రధాన బలమని శేరి సతీష్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణను గౌరవిస్తూ స్థానిక నాయకత్వం, జిల్లా కాంగ్రెస్ కమిటీతో సమన్వయంగా పనిచేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
సస్పెన్షన్ ఎత్తివేతతో కాంగ్రెస్ పార్టీలో తన రాజకీయ ప్రయాణాన్ని మరింత ఉత్సాహంగా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.






