భాగ్యనగరం ఆధ్యాత్మిక సంద్రంగా మారింది. శుక్రవారం నగరంలో ఎటు చూసినా గణనాథుల శోభాయాత్ర కోలాహలం మిన్నంటింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన ఘట్టాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, హుస్సేన్‌సాగర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. ఉత్సవ కమిటీ ప్రత్యేక పూజల అనంతరం భారీ క్రేన్ల సాయంతో స్వామివారిని గంగ ఒడికి చేర్చారు. మరోవైపు బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాట రూ.1,116 ప్రారంభ ధరతో మొదలై తీవ్ర పోటీ నడుమ సాగింది. మొత్తం తొమ్మిది మంది పోటీ పడగా, చివరకు సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. శోభాయాత్ర సజావుగా సాగేందుకు 30 వేల మంది పోలీసులు, డ్రోన్లు, షీ టీమ్స్‌తో పటిష్ట భద్రత కల్పించారు. ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెలికాప్టర్ ద్వారా నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. నగరవ్యాప్తంగా 15 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం విధులు నిర్వహించి వ్యర్థాలను తొలగించారు.

For more information on this article, read page number 1 & 2 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026.