హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో సచివాలయంలో సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొన్నారు.
టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈఓ దీపేష్ నందా పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్ ఏఐ CTO ఉదయ్ రుద్రరాజు కూడా పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె. శశాంక, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణాదిత్య, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ నిఖిల్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్ వాల్ట్ మరియు భాగస్వామ్య సంస్థలు రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోంది” అని అన్నారు.
టీసీఎస్ ప్రతినిధులను అభినందిస్తూ, ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. “ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడింది. తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఇది కీలక ముందడుగు” అని పేర్కొన్నారు.
ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు కార్యరూపంలోకి వచ్చింది. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల పోటీని అధిగమించి తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించింది.
ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత చేరువైంది.
#“AI Data Center Hyderabad”
#“TCS HyperVault Telangana Investment”)






