అభ్యుదయం - తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజారవాణాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతి సచివాలయంలోని తన కార్యాలయం నుంచి ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు, జిల్లా ఇంజనీర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల వల్ల రహదారులపై ఏర్పడే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అధికార యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద నీటి ప్రవాహ తీవ్రతను తెలిపే సూచికలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రహదారులపైకి ఒరిగిన చెట్లు, విరిగిపడిన కొమ్మలను తక్షణమే తొలగించాలని చెప్పారు. గండ్లు పడే అవకాశం ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, ఆర్సీసీ పైపులు వంటి రక్షణ సామగ్రిని అత్యవసరంగా సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
మరింత సమాచారం కోసం ‘అభ్యుదయం’ ఈ-పేపర్ పేజీ నంబర్ 2 చూడండి (తేదీ: 25-09-2026).






