అభ్యుదయం - హైదరాబాద్‌లో ఈ నెల 25న జరిగే మహానిమజ్జన శోభాయాత్రకు సిటీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. బందోబస్తుకు 20 వేల మంది పోలీసులను సిద్ధం చేయగా, ఇతర జిల్లాల నుంచి 8,142 మంది అధికారులు, సిబ్బంది రానున్నారు. 42 ప్లాటూన్లను ఏడు జోన్లకు కేటాయించి, 4 ఆర్ఏఎఫ్‌, 2 సీఆర్‌పీఎఫ్‌ కంపెనీలను మోహరించనున్నారు. తనిఖీల కోసం 53 బీడీ బృందాలు కూడా విధుల్లో ఉంటాయి.
శోభాయాత్రపై 10 వేల సీసీ కెమెరాలు, 24 అత్యాధునిక డ్రోన్లతో నిఘా పెట్టనున్నారు. ప్రధాన మార్గాల్లో 100 వరకు హైరైజ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, పీపుల్స్‌ ప్లాజా వద్ద ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. బాలాపూర్‌ నుంచి హుస్సేన్‌సాగర్‌ వరకు రూట్‌ తనిఖీలు పూర్తయ్యాయి. రోడ్ల మరమ్మతులు, విద్యుత్‌ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపు పనులు కూడా పూర్తి చేశారు.
ఇప్పటివరకు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తవగా, గత 24 గంటల్లో 2,161 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ను 25 లక్షల మంది, బాలాపూర్‌ గణేష్‌ను 15 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రత కల్పించనున్నారు. జలాశయాల వద్ద గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లు, అంబులెన్సులు, ఫైర్‌ ఇంజిన్లు, జనరేటర్లను సిద్ధంగా ఉంచారు.
మహిళల భద్రతకు 26 షీ-టీమ్స్‌ బృందాలు, నేర నియంత్రణకు 25 ప్రత్యేక మఫ్టీ బృందాలు నిఘా నిర్వహిస్తాయి. ఇప్పటివరకు 1,172 మంది ఆకతాయిలపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డీజేలు, సౌండ్‌ మిక్సర్లు, అధిక శబ్ద పరికరాలు, బాణసంచా వినియోగంపై నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పరికరాలు సీజ్‌ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పుకార్లు, విద్వేష పోస్టులు వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. కేటాయించిన జలాశయాల్లోనే నిమజ్జనం చేయాలని, ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని, గంగా-జమునా తెహజీబ్‌ను కాపాడుతూ నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.