న్యూఢిల్లీ:
గత సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూరులో జరిగిన ర్యాలీ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనలో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన రద్దు ఉత్తర్వులపై జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్టే విధించింది.
​ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. "ఒక దురదృష్టకర సంఘటనలో ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆ కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి చనిపోతే వారి అర్హతలను బట్టి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనుకోవడాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. ఇది ప్రభుత్వ విధానపరమైన (Policy decision) నిర్ణయం" అని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద ప్రభుత్వానికి విపత్తు బాధితులను పునరావాసం కల్పించే హక్కు ఉంటుందని వివరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.