ఉపరాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ ఎంగేజ్‌మెంట్ ప్రోగ్రామ్ (IN-STEP) 4వ ఎడిషన్ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (NSCS) సంయుక్తంగా నేషనల్ డిఫెన్స్ కాలేజీ (NDC) ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాయి.
గ్లోబల్ సౌత్ పరిధిలోని 22 అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విచ్చేసిన 25 మంది అంతర్జాతీయ ప్రతినిధులకు ఉపరాష్ట్రపతి సాదర స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న సాంకేతిక విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్‌స్పేస్, ఇంధన మరియు సముద్ర భద్రత, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సరఫరా గొలుసులపై తలెత్తుతున్న సమస్యలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి సంక్లిష్ట సమస్యలను ఏ ఒక్క దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, గ్లోబల్ సౌత్ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. "ప్రపంచ దృక్పథంతో ఆలోచించండి.. వ్యూహాత్మకంగా భాగస్వామ్యం అవ్వండి.. ఐక్యంగా కార్యాచరణ చేపట్టండి" అని అంతర్జాతీయ ప్రతినిధులను ఆయన కోరారు.






