అభ్యుదయం - న్యూస్ డెస్క్, హైదరాబాద్:;దైవకార్యం పేరుతో ఇంట్లోకి ప్రవేశించి భారీగా బంగారు, వెండి ఆభరణాలు తస్కరించిన నిందితుడిని కేపీహెచ్‌బీ మరియు సీసీఎస్ కూకట్‌పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 161.28 గ్రాముల బంగారం, 34.50 గ్రాముల వెండితో పాటు ఒక బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగింది?
నిజాంపేట్ ఎక్స్ రోడ్స్ పరిధిలోని ఈడెన్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివసించే బోనగిరి రాధిక కుటుంబసభ్యులు ఈ నెల 16న తమ ఇంటి ముందు అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన పూజారితో పాటు మూసాపేటకు చెందిన ఎలక్ట్రీషియన్ చెన్నబోయిన రాజేందర్ @ రాజు (28) సహాయక పూజారిగా హాజరయ్యాడు.
దుస్తులు మార్చుకోవడానికి నిందితుడిని ఇంట్లోకి అనుమతించగా, రాత్రి వేళ కుటుంబసభ్యులంతా పూజా కార్యక్రమాల్లో తలమునకలై ఉన్న సమయంలో బెడ్‌రూమ్‌లోని బీరువా తలుపులు తెరిచి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. అనంతరం ఆ సొత్తును మూసాపేటలోని తన అద్దె ఇంట్లో దాచిపెట్టాడు. ఈ నెల 21న బాధితురాలు గుర్తించి కేపీహెచ్‌బీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
లులు మాల్ సమీపంలో పట్టివేత
కేపీహెచ్‌బీ క్రైమ్ బృందం, సీసీఎస్ కూకట్‌పల్లి పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. దొంగిలించిన ఆభరణాలను తక్కువ ధరకు విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నిస్తుండగా, శుక్రవారం కేపీహెచ్‌బీలోని లులు మాల్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:
బంగారు ఆభరణాలు: 161.28 గ్రాములు (పెద్ద గాజు, కడియం, నల్లపూసల గొలుసు, బ్రేస్‌లెట్, ఉంగరాలు తదితరాలు)
వెండి ఆభరణాలు: 34.50 గ్రాములు (గొలుసు, మెట్టెలు, ఉంగరం)
ఇతర వస్తువులు: స్ప్లెండర్ ప్లస్ బైక్ (AP09CH3439), వివో వి40 మొబైల్ ఫోన్.
నిందితుడిపై గతంలో సనత్‌నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లలో బైక్ చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల హెచ్చరిక: శుభకార్యాలు, పూజల సమయంలో ఇంట్లోకి కొత్త వ్యక్తులను అనుమతించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులు, నగదును జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని కేపీహెచ్‌బీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.






