ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 3:15 గంటల సమయంలో ఓ ఐదు అంతస్తుల భవనం ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దంతో భవనం కళ్లముందే నేలమట్టం కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు చెలరేగి, స్థానికులు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల తొలగింపు చర్యలను వేగవంతం చేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరు చిన్నారులతో సహా నలుగురిని బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే భవన యజమానితో పాటు ఒకే కుటుంబానికి చెందిన సుమారు ఆరుగురు వ్యక్తులు ఇంకా శిథిలాల కిందే చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

For more information on this article, please refer to Page Number 1 & 2, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026