దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారుల డేటా లీక్ కావడం కలకలం సృష్టిస్తోంది. థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, సెర్ట్-ఇన్ (CERT-In) అందించిన సమాచారం ప్రకారం.. డార్క్ వెబ్‌లో లభ్యమైన 3.75 లక్షల రికార్డుల్లో 3,897 మంది ఎస్బీఐ ఖాతాదారుల సమాచారం లీకైనట్లు తేలింది. ఈ వివరాలను ఎస్బీఐ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా నివేదించింది. లీకైన సమాచారంలో కస్టమర్ల పేర్లు, లింగం, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, ఈమెయిల్ ఐడీలతో పాటు బ్యాంక్ బ్రాంచ్ కోడ్, సీఐఎఫ్ ఐడీ, లోన్ వివరాలు ఉన్నట్లు గుర్తించారు.

అయితే ఈ సైబర్ దాడి వల్ల బ్యాంక్ సర్వర్లకు గానీ, ఆర్థిక లావాదేవీల వ్యవస్థకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. డేటా లీక్ అయినంత మాత్రాన ఖాతాలు హ్యాక్ అయినట్లు కాదని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా సైబర్ నేరగాళ్లు బ్యాంక్ సిబ్బందిగా ఫోన్లు చేసి మోసగించే అవకాశమున్నందున ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓటీపీ (OTP), పాస్‌వర్డ్‌లు, ఏటీఎం పిన్ నంబర్లను ఎవరికీ చెప్పవద్దని, బయోమెట్రిక్ లాక్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలని కోరింది.