ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ మరియు వ్యూహాత్మక విక్రయం (Strategic Disinvestment)పై వస్తున్న తప్పుడు కథనాలపై కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ద్వారా స్పష్టతనిచ్చింది. 2003 కేంద్ర బడ్జెట్ మరియు 'ఐడీబీఐ (రద్దు) చట్టం, 2003' చర్చల సందర్భంగా ప్రభుత్వ వాటాను తగ్గించకుండా నియంత్రించేందుకు తెచ్చిన ప్రతిపాదనను పార్లమెంట్ తిరస్కరించిందని ప్రభుత్వం గుర్తుచేసింది.
ఈ వ్యవహారంపై 2018 డిసెంబర్ 17న 'ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్' కేసులో ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. దశాబ్దాల క్రితం సభలో జరిగిన చర్చలు పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని భర్తీ చేయలేవని, ఉద్యోగుల వాదనకు 'ప్రామిసరీ ఎస్టోపెల్' వర్తించదని ధర్మాసనం పేర్కొంది. చట్టంలో ప్రభుత్వ వాటా తగ్గింపుపై ఎలాంటి పరిమితి లేదని తేల్చింది. అంతేకాకుండా, 2016–17లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, 2021–22లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రసంగాల్లో ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారని, ఈ ప్రక్రియ చట్టబద్ధంగానే కొనసాగుతోందని కేంద్రం వివరించింది.






