ఆంధ్రప్రదేశ్లోని 19 మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తాత్కాలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఆదేశాల మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంటూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. దీంతో ఆయా పురపాలక సంఘాల్లో జరగాల్సిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ నిలిచిపోయాయి.
రాష్ట్రంలో అధికార కూటమి నేతలు తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని, స్క్రూటినీలో అక్రమంగా తిరస్కరించారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక సూత్రమని స్పష్టం చేసిన అత్యున్నత న్యాయస్థానం.. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అక్టోబర్ 22 నాటికి నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని ఆదేశించింది. అప్పటివరకు తుది జాబితాను ప్రచురించవద్దని, అన్ని పరిశీలనల అనంతరం అక్టోబర్ 25న జాబితాను వెల్లడించాలని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు పూర్తి ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం abhyudhayam ఈ-పేపర్ తేది 22-10-2026 చూడగలరు.






