శీతాకాలం ప్రారంభం కావడంతోనే దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 223 గా నమోదై 'పూర్' (Poor) కేటగిరీకి పడిపోయింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో గాలిలో కాలుష్య కారకాలు స్థిరపడి ప్రజలు శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-1’ (GRAP-1) ఆంక్షలను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు.
గ్రాప్-1 నిబంధనల ప్రకారం.. ఢిల్లీలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లలో వంటల కోసం బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. విద్యుత్ సరఫరాకు ప్రత్యామ్నాయంగా వాడే డీజిల్ జనరేటర్లను ఎమర్జెన్సీ సేవల మినహా ఇతర ప్రయోజనాలకు వాడకూడదు. రోడ్లపై దుమ్మును నివారించేందుకు మెకానికల్ స్వీపింగ్, నీటిని చల్లడం వంటి పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి బహిరంగంగా చెత్త, ఎండుటాకులు కాల్చే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.






