అభ్యుదయం-రవాణా శాఖ, టీజీఎస్‌ఆర్టీసీతో గతంలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా కేపీహెచ్‌బీ నుంచి వేవ్‌రాక్ వరకు ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ట్రయల్ రన్ నిర్వహించారు. రద్దీ సమయాల్లో టీజీఎస్‌ఆర్టీసీ, ఐటీ సంస్థల బస్సులు వేగంగా ప్రయాణించేలా చేసి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం ఈ ప్రతిపాదన లక్ష్యం.
ట్రాఫిక్ ప్రవాహం, రహదారి సామర్థ్యం, ప్రత్యేక బస్ మార్గం అమలుకు అవసరమైన అంశాలను రోడ్డు, నగర ప్రణాళిక నిపుణులతో కలిసి పరిశీలించారు. బస్సులు తక్కువ స్టాప్‌లతో ప్రయాణించే విధానం ద్వారా వేగవంతమైన రాకపోకలు సాధ్యమవుతాయా అన్నదానిపైనా అంచనా వేశారు.
రద్దీ వేళల్లో జేఎన్‌టీయూ–బయోడైవర్సిటీ కారిడార్‌లో వాహనాల కదలికను పరిశీలించి, ఆ మార్గంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించే అవకాశాలను కూడా ట్రయల్ రన్‌లో అధ్యయనం చేశారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శ్రీ సన్‌ప్రీత్ సింగ్, ఐపీఎస్; ట్రాఫిక్–II డీసీపీ శ్రీమతి శేషాద్రిణి రెడ్డి, ఐపీఎస్; టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ శ్రీధర్; ఎస్‌సీఎస్‌సీ సీఈఓ శ్రీ నవీద్ ఆలం ఖాన్‌తో పాటు ఇతర అధికారులు, సంబంధిత శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.






