అభ్యుదయం-హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో Cr.No.1096/2026 U/s 69, 89 BNS కింద నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గర్భం తొలగించేందుకు మాత్రలు తీసుకున్న అనంతరం తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన 30 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కేసులో తదుపరి దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు గర్భం దాల్చిన విషయం తెలిసిన అనంతరం, నిందితుడు అరేపు నాగసాయి (26) తనకు ఇప్పటికే వివాహం అయిన విషయాన్ని దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.
బాధితురాలు గర్భం దాల్చిన అనంతరం గర్భాన్ని తొలగించేందుకు నిందితుడు మాత్రలు ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాధితురాలికి తీవ్ర రక్తస్రావం, కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమెను కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్‌ ఆసుపత్రి ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు.
దర్యాప్తులో భాగంగా 2026 సెప్టెంబర్‌ 9న నిందితుడు దర్యాప్తు అధికారిని (IO) సంప్రదించగా, అతడిని విచారించారు. బాధితురాలితో కమ్యూనికేషన్‌కు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్న అతని వన్‌ప్లస్‌ మొబైల్‌ ఫోన్‌ను పంచనామా ద్వారా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి న్యాయ రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి వైద్య పరీక్షలతో పాటు పొటెన్సీ పరీక్షలు కూడా నిబంధనల ప్రకారం నిర్వహించారు.
మరోవైపు బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ సెప్టెంబర్‌ 14న రాత్రి 7 గంటల సమయంలో ఆమె మృతి చెందింది.
బాధితురాలి మృతి నేపథ్యంలో కేసులోని BNS సెక్షన్‌ 89ను సెక్షన్‌ 90(2)గా మార్చినట్లు కేపీహెచ్‌బీ పోలీసులు తెలిపారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.