‘ఆర్ఎక్స్ 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా ట్రోలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల ఆమె షేర్ చేసిన వీడియోలపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్ చేస్తూ, శరీర కొలతలను ప్రస్తావిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెట్టారు. దీనిపై పాయల్ తీవ్రంగా స్పందిస్తూ ఒక సుదీర్ఘమైన పోస్ట్ విడుదల చేశారు.

"మీలాంటి వారిని చూస్తే నిజంగా సిగ్గేస్తోంది! నా శరీరాకృతిని వేలెత్తి చూపుతూ వికృత కామెంట్లు రాస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. ఇది నా శరీరం.. నా సైజ్.. నా గర్వం! నా శరీరం మీ చర్చలకు, మీ చెత్త అభిప్రాయాలకు, మీ అసభ్యతకు చర్చనీయాంశం కాదు. మీ హద్దుల్లో మీరు ఉండండి.. మీ పనేదో మీరు చూసుకోండి!" అంటూ తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. సెలబ్రిటీల వ్యక్తిగత రూపాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయడం సైబర్ నేరమని, హద్దులు దాటితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.