భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' నుంచి దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ పవర్ఫుల్ మ్యూజికల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తుండగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ లంకాధిపతి రావణాసురుడి పాత్రలో నటిస్తున్నారు. తాజా గ్లింప్స్‌లో యశ్ రావణుడి గెటప్‌లో తీవ్రమైన ఇంటెన్స్ లుక్‌తో కనిపించి అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు.
దాదాపు రెండు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో రావణుడికి శివుడిపై ఉన్న అనన్య భక్తిని అత్యంత వైభవోపేతంగా చూపించారు. తన చేతిని కత్తితో కోసుకుని రక్తంతో నుదుట త్రిపుండ్ర ధారణ చేయడం, శివలింగం ముందు రుద్ర హారతి ఇవ్వడం, ఆపై 'శివ తాండవ స్తోత్రం' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రావణుడు చేసే ఉగ్ర తాండవం ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సమకూర్చిన అద్భుత సంగీతం, డాక్టర్ కుమార్ విశ్వాస్ సాహిత్యం, విశాల్ దద్లానీ గానం వెండితెరపై రావణుడి విరాట్ రూపాన్ని ఆవిష్కరించాయి.






