తెలంగాణలో భారీ జీఎస్టీ మోసం వెలుగుచూసింది. హైదరాబాద్ జోన్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, రంగారెడ్డి సీజీఎస్టీ ప్రిన్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో యాంటీ-ఎవేషన్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనగర్ కాలనీ కేంద్రంగా నడుస్తున్న 'మెసర్స్ శ్రీ తిరుమల సర్వీసెస్' సంస్థ ప్రధాన కార్యాలయం, దాని ప్రొప్రైటర్ దారా రవికిశోర్ నివాసంలో సీజీఎస్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. సంస్థ యజమాని రవికిశోర్ నిబంధనలకు విరుద్ధంగా తన సంస్థను స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) యూనిట్‌గా జీఎస్టీ పోర్టల్‌లో తప్పుడు వివరాలతో నమోదు చేసుకున్నారు. దీనికోసం విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ) డెవలప్‌మెంట్ కమిషనర్ జారీ చేసినట్లుగా ఉన్న ఒక నకిలీ లెటర్ ఆఫ్ అప్రూవల్ (Letter of Approval)ను సృష్టించారు. సెజ్ యూనిట్లకు ఉండే జీరో-రేటెడ్ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని ఆసరాగా చేసుకుని, ఎలాంటి పన్ను చెల్లించకుండా భారీ ఎత్తున సరుకులను సమకూర్చుకున్నారు. సుమారు రూ.30 కోట్ల విలువైన పన్ను పరిధిలోకి వచ్చే సప్లైలపై దాదాపు రూ.5.68 కోట్ల మేర జీఎస్టీని ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.
దీంతో నిందితుడు దారా రవికిశోర్‌ను సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) చట్టం, 2017 లోని సెక్షన్ 69 కింద అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. చట్టబద్ధమైన మినహాయింపులను అక్రమంగా పొందడం, పన్నులు చెల్లించకుండా వ్యాపారాలు చేసే మోసగాళ్లపై ప్రాసిక్యూషన్ సహా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని సీజీఎస్టీ ఉన్నతాధికారులు హెచ్చరించారు.






