అభ్యుదయం – జీడిమెట్ల/బాలానగర్:
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి చట్టం–2026 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో బాలానగర్‌లోని MSME కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా MSME DFO జాయింట్ డైరెక్టర్ సి. శివ శేషగిరి రావు మాట్లాడుతూ.. సుమారు 20 ఏళ్ల తర్వాత MSME చట్టంలో కీలక సవరణలు చేపట్టినట్లు తెలిపారు. సవరించిన చట్టం ద్వారా చట్టపరమైన వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు వ్యాపార సౌలభ్యం, పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో వేగం పెరగనుందని పేర్కొన్నారు.
సవరించిన చట్టంలో పెట్టుబడి, టర్నోవర్ ఆధారంగా MSME వర్గీకరణకు చట్టబద్ధత కల్పించినట్లు తెలిపారు. అలాగే పారిశ్రామికవేత్తలు ఎలాంటి రుసుము లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.
ఉద్యమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న MSME యూనిట్ల సంఖ్య గత మూడేళ్లలో 1.65 కోట్ల నుంచి 9.16 కోట్లకు పెరిగిందని శివ శేషగిరి రావు తెలిపారు. దేశవ్యాప్తంగా MSME రంగం సుమారు 40 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోందని వెల్లడించారు..