అభ్యుదయం - హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ప్రజా రవాణా, రోడ్డు భద్రత సమస్యలకు డేటా ఆధారిత పరిష్కారాలను రూపొందించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘సైబరాబాద్ మొబిలిటీ డేటాజామ్’ నిర్వహించారు. సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో టెక్నాలజీ నిపుణులు, పట్టణ ప్రణాళికకర్తలు, విద్యార్థులు, పాత్రికేయులు, ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, పౌరసమాజ సంస్థల సభ్యులు కలిపి సుమారు 100 మంది పాల్గొన్నారు. నగర రవాణా సమస్యలపై విభిన్న రంగాలవారు కలిసి ఆలోచనలు చేయడం ఈ డేటాజామ్ ప్రత్యేకతగా నిలిచింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్ డేటాజామ్‌ను ప్రారంభించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సుర్‌ప్రీత్ సింగ్ ఐపీఎస్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ ఉదయ్ కుమార్ ఐఏఎస్, ఓపెన్ డేటా తెలంగాణ కమిషనర్ రవి కిరణ్ ఐఎఫ్‌ఎస్, టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ శ్రీధర్, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ ఎం. రవీంద్రన్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ రద్దీ, వార్డు స్థాయి రవాణా సూచీలు, ప్రజా రవాణా అందుబాటు, డేటా విజువలైజేషన్ వంటి అంశాలపై పాల్గొనేవారికి సమస్యలను కేటాయించారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అందించిన డేటాసెట్‌లను విశ్లేషిస్తూ బృందాలు చర్చలు నిర్వహించాయి. ఈ క్రమంలో రవాణా అవసరాల అంచనా, సేవల మ్యాపింగ్, రోడ్డు భద్రత, నగరంలో వివిధ ప్రాంతాల డిమాండ్‌కు తగ్గ రవాణా సేవల రూపకల్పనపై నమూనా పరిష్కారాలను రూపొందించాయి.
డాక్టర్ ఎం. రమేశ్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పౌరులు తమ సమయం, నైపుణ్యాలను అందించడం ద్వారా నగరానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. వాస్తవ పరిస్థితులు, డేటా ఆధారంగా వచ్చిన ఆలోచనలను అమలు దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జాయింట్ సీపీ సుర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి ప్రజలు షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఎంచుకునేలా విశ్వసనీయమైన రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రవి కిరణ్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో వచ్చిన పరిష్కారాలు పౌర కేంద్రిత సేవల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు.
టీజీఎస్‌ఆర్టీసీ ఈడీ శ్రీధర్ మాట్లాడుతూ, డేటాజామ్ ద్వారా లభించిన విశ్లేషణలు బస్సుల కదలికలను సమర్థంగా ప్రణాళిక చేయడానికి, ప్రయాణికుల సంఖ్య పెంచడానికి, అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలకు బస్సు సేవలను విస్తరించడానికి తోడ్పడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, ఎస్‌సీఎస్‌సీ, సైబరాబాద్ మెట్రోపాలిటన్ కమిషనరేట్, జీహెచ్‌ఎంసీ, ఓపెన్ డేటా తెలంగాణ, టీ-హబ్, టీజీఎస్‌ఆర్టీసీతో పాటు డబ్ల్యూఆర్ఐ ఇండియా నేతృత్వంలోని షిఫ్ట్ ట్రాన్స్‌పోర్ట్ కోలిషన్, ఎఫ్‌డీఆర్, సర్వజన ఫౌండేషన్, ఓపెన్‌సిటీ.ఇన్ సంస్థలు సహకరించాయి.






