తెలంగాణలో చెరువులు ఎండిపోయి, కాలువల్లో నీరు రాక, సాగుచేసిన పంటలు చేతికి అందక రైతులు కన్నీరుమున్నీరవుతుంటే.. మద్యం వ్యాపారంలో మాత్రం ప్రభుత్వం అద్భుత ప్రణాళికను అమలు చేసింది. సాగునీరు అందించడంలో, నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో చేతులెత్తేసిన పాలకులు, రాష్ట్రంలోని 17 మద్యం డిపోల నుంచి మారుమూల పల్లెలకు సైతం లారీల కొద్దీ మద్యం నిరంతరాయంగా సరఫరా చేశారు.

ఎక్సైజ్ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ట్రంలోని 2,620 వైన్ షాపులు, 1,133 బార్లలో మద్యం అమ్మకాలు ఆకాశాన్ని తాకాయి. గతేడాది దసరాకు రూ. 697.23 కోట్ల విక్రయాలు జరగ్గా, ఈసారి రూ. 57.91 కోట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అక్టోబర్ 1 నుంచి 19 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ. 2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఇందులో లిక్కర్ అమ్మకాలు 18.38 లక్షల కేసులు కాగా, బీర్ల అమ్మకాలు 30.37 లక్షల కేసుల మైలురాయిని దాటేశాయి. పంటలను కాపాడటానికి నిధులు లేవన్న ప్రభుత్వం, మద్యం సరఫరాలో మాత్రం గంట కూడా కొరత రాకుండా సమర్థత చూపిందంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.