వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధుల కొరత లేకున్నా పనులు ఎందుకు నెమ్మదిగా సాగుతున్నాయో ప్రశ్నించి, వచ్చే 30 రోజులు 24 గంటల పాటు పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి పనికి ప్రత్యేక బాధ్యత కేటాయించాలని, కలెక్టర్ స్థాయి నుంచి రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సనత్‌నగర్ టిమ్స్ నమూనాలో వరంగల్‌లో త్వరలోనే ఓపీ సేవలు అందుబాటులోకి రావాలని, ఆస్పత్రి పరిసరాలను మెరుగుపరచాలని చెప్పారు.

వరంగల్‌ను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయాలని కూడా సీఎం పేర్కొన్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల మధ్య రోడ్డు అనుసంధానంతో పాటు విమానాశ్రయానికి కనెక్టివిటీ కల్పించే అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.