సీఎస్ సంజయ్ జాజు గనులు, భూగర్భ వనరుల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ ఇసుక రవాణా, అనధికారిక ఖనిజాల తరలింపుపై ఉక్కుపాదం మోపాలని ఆయన ఆదేశించారు. విజిలెన్స్ బృందాలతో నిరంతర తనిఖీలు, ఆకస్మిక దాడులు జరపాలని సూచించారు.
అక్రమ కార్యకలాపాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.
ఖనిజ వనరుల సమర్థ వినియోగంతో రాష్ట్ర ఆదాయం పెంచడం, శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయడం, ఉద్యోగుల పదోన్నతులను నిబంధనల మేరకు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచాలని, సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ ఆదాయం పెంపే లక్ష్యంగా శాఖ పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.






