దశాబ్దాలుగా కొనసాగిన ‘బ్రెయిన్ డ్రెయిన్’ ధోరణి ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవుతోంది. మెరుగైన ఉపాధి, ఉన్నత జీవన ప్రమాణాల కోసం అమెరికా వెళ్లిన భారతీయ ఐటీ నిపుణులు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అమెరికాలోని దిగ్గజ టెక్ సంస్థల్లో పనిచేస్తున్న వైట్ కాలర్ ఉద్యోగులు సైతం భారత్‌లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. స్టాఫింగ్ సంస్థల డేటా ప్రకారం.. 2023లో 7,200 మంది, 2024లో 9,800 మంది, 2025లో 15,100 మంది టెక్కీలు స్వదేశానికి రాగా, 2026లో తొలి తొమ్మిది నెలల్లోనే ఆ సంఖ్య 12,700కు చేరింది. ఏడాది ముగిసే నాటికి ఇది ఆల్‌టైమ్ రికార్డును చేరుకునే అవకాశముంది.

యూఎస్‌లో హెచ్1-బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, పౌరసత్వం/గ్రీన్ కార్డు జారీలో దశాబ్దాల నిరీక్షణ, ఐటీ కంపెనీల్లో నిరంతర లేఆఫ్స్ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు భారత్‌లో ఫార్చ్యూన్ 500 కంపెనీలు తమ గ్లోబల్ సెంటర్లను విస్తరిస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరులలో జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో కీలక లీడర్‌షిప్ బాధ్యతలు లభిస్తుండటంతో స్వదేశంలో వేతనాల్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ సురక్షితమైన కెరీర్ ఎదుగుదలకు నిపుణులు ప్రాధాన్యం ఇస్తున్నారు.