విజయవాడ: తాను ఎవరినో కలుస్తున్నట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా కట్టుకథేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. తనపై అల్లుతున్న కథనాలు, జరుగుతున్న విశ్లేషణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె తీవ్రంగా ఖండించారు.

తనకు గిట్టని వారు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్లో తన విశ్వసనీయతను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సందర్భంలో కలిసినట్లు షర్మిల వివరించారు. ప్రస్తుతం మళ్లీ కలిసినా అది తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికే అని స్పష్టం చేశారు.

తన కుమార్తె వివాహానికి అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానిస్తానని, నవదంపతులను ఆశీర్వదించాలని కోరుతానని తెలిపారు. ఇందులో కొత్తదనం, వింత ఏమీ లేదన్నారు.

కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకుని తెర వెనుక రాజకీయాలు చేసే ఖర్మ తనకు లేదని షర్మిల వ్యాఖ్యానించారు. శుభకార్యానికి రాజకీయాలను ముడిపెట్టి తన రాజకీయ ప్రామాణికతను, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హృదయపూర్వక ఆశీస్సులు అందించాలని ఆమె కోరారు.