అభ్యుదయం: కూకట్‌పల్లి మండల పరిధిలో జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు మండల రెవెన్యూ అధికారి అశోక్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల కేటాయింపులో అర్హత, సీనియారిటీ, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం పారదర్శకంగా కేటాయింపులు చేపట్టాలని కోరారు. ఏ విధమైన రాజకీయ, వ్యక్తిగత లేదా ఇతర ప్రభావాలకు తావులేకుండా అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సోమవారం మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ను కలిసి ఇదే విషయం పై వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
సీనియారిటీ ఆధారంగా పరిశీలిస్తాం: ఎంఆర్‌ఓ
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎంఆర్‌ఓ అశోక్‌కుమార్ స్పందిస్తూ.. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలిస్తామని తెలిపారు. అర్హత, సీనియారిటీ, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులకు న్యాయం జరిగేలా సంబంధిత అంశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్టులు పాల్గొనడం
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కట్టెల మల్లేష్, సి.హెచ్. రామారావు, మండపాక కళ్యాణ్ చక్రవర్తి, దాదె వెంకట్, ఎం.ఎస్. ఆనంద్‌రావు, అంబటి వెంకట్, జంగాల నాగార్జున, బి. శంకర్ పాల్గొన్నారు.






