కదిరి:
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ పిలుపులో భాగంగా కదిరి పట్టణంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కదిరి మున్సిపల్ అధికారులు, వివిధ పాఠశాలల యాజమాన్యాలు సంయుక్తంగా చేపట్టిన 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాక ర్యాలీని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు.
​ఎన్జీవో హోం వద్ద మొదలైన ఈ ర్యాలీ జ్యోతిరావు పూలే సర్కిల్ మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. వేలాది మంది విద్యార్థులు "భారత్ మాతాకీ జై", "వందేమాతరం" అంటూ నినాదాలు చేస్తూ భారీ జెండాను చేతబూని పురవీధుల్లో నడిచారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం పట్టణ ప్రజలను దేశభక్తి భావనలో ముంచెత్తింది.