హైదరాబాద్ కూకట్‌పల్లి పరిధిలో పోలీసుల పేరును ఉపయోగించి మోసానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను KPHB పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పలపాటి కాశీ విశ్వనాథ రాజు (39), సయ్యపరాజు సురేష్ కుమార్ (43) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 8న ఫిర్యాదుదారురాలి తమ్ముడిని NDPS కేసులో పోలీసులు విచారణకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నిందితులు తమకు పోలీసు శాఖలో ఉన్నతస్థాయి పరిచయాలు ఉన్నాయని, కేసు నుంచి బయటకు తీసుకువస్తామని ఆమెను నమ్మించారు.
జైలుకు వెళ్లే అవకాశం ఉందని భయపెట్టి కేసును మేనేజ్ చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఫిర్యాదుదారురాలు రూ.1.10 లక్షల నగదుతో పాటు PhonePe ద్వారా మరో రూ.30 వేలు చెల్లించింది.
ఫిర్యాదు అందుకున్న KPHB పోలీసులు Cr.No.1014/2026, U/s 308(2) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగస్టు 10న KPHB బస్‌స్టాప్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
A-1 వద్ద రూ.60 వేలు, Redmi ఫోన్, A-2 వద్ద రూ.50 వేలు, OPPO ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. PhonePe ద్వారా బదిలీ చేసిన రూ.30 వేల మొత్తాన్ని A-2 బ్యాంకు ఖాతాలో గుర్తించి ఫ్రీజ్ చేశారు.
పోలీసుల పేరుతో కేసులు మేనేజ్ చేస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నమ్మవద్దని, వెంటనే పోలీసులను సంప్రదించాలని KPHB పోలీసులు ప్రజలకు సూచించారు.
ఫోటో:
KPHB పోలీసులు పట్టుకున్న నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు మరియు మొబైల్ ఫోన్లు.