కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్ఎంసీ), విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) భూముల తొలి పూర్తిస్థాయి ఈ-వేలాన్ని విజయవంతంగా నిర్వహించింది. రైల్‌టెల్ 'ఈ-నివిదా' ప్లాట్‌ఫామ్ ద్వారా క్వికర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (క్యూఐపీఎల్) ట్రాన్సాక్షన్ కన్సల్టెంట్‌గా ఈ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశారు.
తొలి దశలో ఉంచిన ప్లాట్లలో 150 ప్లాట్లు అమ్ముడుపోగా, నిర్ణయించిన రిజర్వు ధర కంటే సగటున 17.23 శాతం అధిక మొత్తాన్ని సాధించాయి. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోని భూములకు భారీ డిమాండ్ ఉండటంతో చదరపు గజం గరిష్ఠంగా ₹1.80 లక్షలు దాటింది. ప్రభుత్వ రంగ సంస్థల వద్ద ఉన్న మిగులు భూములను సమర్థవంతంగా, సాంకేతిక ఆధారిత విధానంలో మానిటైజ్ చేయడానికి ఎన్‌ఎల్ఎంసీ చేపట్టిన ఈ ప్రయత్నం విజయవంతమైంది.
ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన 216 ప్లాట్లను రెండో దశలో వేలం వేయనున్నారు. అక్టోబర్ 30న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ చివరి దశ వేలం జరుగుతుంది. విశాఖపట్నంలో స్థలాలను దక్కించుకోవాలనుకునే కొనుగోలుదారులు అక్టోబర్ 27వ తేదీలోగా అధికారిక పోర్టల్ (eauction.enivida.com) ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.






