కేరళలోని నిలంబూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి అవార్డును అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఓట్లు, నిధులు, పార్టీలు, ఎన్నికల గుర్తుల చోరీ యథేచ్ఛగా సాగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కును కాపాడేందుకు అంతా ఏకం కావాలన్నారు. 2006లో జడ్పీటీసీగా ప్రారంభమైన తన రాజకీయ ప్రస్థానంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి వంటి అనేక పదవులను చూశానని, ఇకపై రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే తన సంకల్పమని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో కేరళ ఒక దిక్సూచి వంటిదని, ఇక్కడ రాజకీయ మార్పు వచ్చిన ప్రతిసారీ కేంద్రంలో మార్పు ఖాయమైందని చరిత్రను గుర్తుచేశారు. 1991, 2004 నాటి పరిణామాలను వివరిస్తూ.. ప్రస్తుతం కేరళలో వీస్తున్న మార్పు గాలి త్వరలోనే దేశమంతటా రాజకీయ తుపానుగా మారి మతతత్వ శక్తులను తుడిచిపెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం, దార్శనిక పాలనను గుర్తించి రేవంత్ రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఫౌండేషన్ చైర్మన్ ఆర్యదాన్ షౌకత్ వెల్లడించారు.
For more information on this article, read page number 1 & 2 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026.


